You Are Here: Home » చిన్నారి » కవితలు » ఆయుధాల అవయవాలు

ఆయుధాల అవయవాలు

శతపత్ర కుసుమాన్ని నేను
నా తోబుట్టు ముళ్ళు
నా పాలిటి తోడేళ్ళు

నా తనువంతా పది పదుల చుండూరులు
నా కళ్ళ నిండా వంద నూర్ల కారంచేడులు
నా కర్ణభేరుల్లో వేల వేల ఖెైర్లాంజీలు
నా వక్షాన లక్షోప లక్షల లక్షింపేటలు
నా వాకిళ్ళన్నీ వాకపల్లులే

స్తనాలు స్థలాలే కాదు
నా కలం నా గళం కూడా
నాపెై దాడికి కారణమౌతున్నాయి
నల్లవాడో తెల్లవాడో మనువో మన్మథుడో
నాకు దక్కింది హింసొక్కటే
రక్తమోడే ప్రశ్ననయి నడుస్తుంటాను నేను
జారుతున్న కండరాలు

రాలుతున్న కేశాలు వడిలిన చర్మాలు
పగిలిన గాజులు పికిలిన రెైకలు
పరీక్షకు నిలవాలని వేదికలంటాయి
నా ప్రశ్నను పంటికింద నొక్కిపట్టి
నాహక్కును కాలి కింద తొక్కిపెట్టి
నా ఆశలను అతిశయాలని
రంగుల తెరలు చిత్రించి
పోస్టు మార్టమ్‌ చేస్తాయి

హలో టీచర్‌ అని ఒకడు
సారీ టీచర్‌ అని ఇంకొకడు
నిత్యం వంకరగా సందేశమిస్తూ మెక సందోహం
నేను మాత్రం పుట్టక ముందే చించబడి
పుట్టినందుకు ఎట్టికి నెట్టబడి
ప్రతి పురుగూ కుట్టేందుకు చుట్టబడతాను
శత్రువెవ్వడూ ఉండడు

రూపాంతరం చెందిన రాబందులే
కాలాంతరాన కామాంధులెైతే
వారి నడుమ నేను
వెలి వేయబడిన తస్లీమాను
కుత్సిత వ్యూహాల్లో
హననం కాబడిన హసీనాను
ఉమ్మ నీటిలో ముంచబడ్డ విజ్జమ్మను

మాటలమంటల్లో కాల్చబడిన కోటమ్మను
వెలుగు చూడని చావుల్లో
లెక్కలు తేలని ఎల్లమ్మను
నా గాయాలు కొందరి గేయపు సరుకులెై
నా విద్యలు మరి కొందరి పాటలకు పల్లవులెై
నా నెైపుణ్యాల నెమలి కన్నులు
ఇంకొందరి కహానిలకు బహానాలెై

నా నొప్పికి వారి మైకు ఏడుస్తోంది
నేను మాత్రం పబ్లిక్‌ స్థలాల్లో
సామూహిక మలాన్నెత్తుతూ
ప్రపంచ పటంలో వెలుగుతున్నా ధెైర్యంగా
చిట్టి పొట్టి స్వార్ధాలు నా పుట్టుక పెై అత్యంత భయంకర ప్రేమతో
మారణహోమం చేస్తుంటే

నా తల్లి దాని తల్లి దాని తల్లి తల్లి
తరతరాల తల్లుల వేదన సాక్షిగా
నాబిడ్డ దాని బిడ్డ దాని బిడ్డ బిడ్డ
రాబోయే తరతరాల బిడ్డల రక్షణకు
ఆయుధాల అవయవాలను అమరుస్తూన్నా

jawaగరళమో గండకత్తెరో కాదు
నీడనిస్తామని తోడుంటామని వస్తున్న
సమస్త ‘కార్నిఓరస్‌’లను
కత్తిరించే కొత్త చురకత్తుల వంటి ధిక్కార గళాల్ని
సాధికార వజ్రాయుధాలను
చట్టసభలకు ఆహ్వానిస్తున్నా…
(‘కార్నిఓరస్‌’ అంటే మాంసాహారమొక్క)

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top