You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » ఆమె గళానికి అంధత్వంలేదు

ఆమె గళానికి అంధత్వంలేదు

ఆమె గళానికి అంధత్వంలేదు

 

రాగం ఆమెకు ఆరో ప్రాణం…చిరుప్రాయంలోనే సంగీతాన్ని ఔపాసన పట్టి…భగవంతుడు తనకు దృష్టిలోపం ఇచ్చి ఒకింత అన్యాయం చేసినా అందమైన ఆమె గళానికి ఎవ్వరైనా దాసోహమవ్వాల్సిందేనని మరో వరం కూడా ఇచ్చాడు. కర్ణాటక సంగీత ప్రపంచానికి ఆమె పేరు చిరపరిచితమే… ఆమె గళం అక్కడి సంగీతాభిమాని ఇంట మార్మాగుతూనే ఉంటుంది. రెండేళ్ల ప్రాయం నుంచే అనేక భక్తిసోత్రత్రాలను కంఠతాబట్టి ఆసువుగా వాటిని లయబద్దంగా పాడుతూ అందరి మెప్పునూ పొందేవారు ఆమె. దేశదేశాలలో భారతీయ సంగీతానికి ఎల్లలు లేవంటూ నిరూపిస్తూ త్యాగరాజస్వామి శిష్యూరాలిగా తన రసరాగ గీతాలతో ఎందరినో అలరిస్తున్నారు. ఆమే డా. హంసినీ నందిని.
HAMSAకర్ణాటక సంగీత ప్రపంచంలో హంసినీ నాగేంద్ర పేరు నేడు ప్రతి సంగీతాభిమాని ఇంటా… మారుమోగుతూనే ఉంది. అంధత్వం ఆమె ప్రగతికి, పురోభివృద్ధికి ఎంతమాత్రం ఆటంకం కాలేదు. సూర్యదేవుని స్తోత్రాలను భక్తిశ్రద్ధలతో పఠించి, ఆ భాస్కరునికి రాగాంజలి ఘటించి, రెండేళ్ల చిరుప్రాయంలోనే తాతగారి వద్ద సంగీతాన్ని అభ్యసించి 12 ఏళ్ల వయస్సు నుంచే కచేరీలు చేయడం ఆరంభించిన హంసినీ నాగేంద్ర కర్ణాటక రాజధాని బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. దేశం నలుమూలలా సంగీత కచేరీలు చేస్తూ త్యాగయ్య ఆరాధనోత్సవాల్లో తన గళమాధుర్యాన్ని ప్రవహింపజేయడానికి ఇటీవల గుంటూరు నగరానికికూడా వచ్చారు. ఆ సందర్భంగా బ్రాడీపేటలోని సిద్ధేశ్వర పీఠం ఓంకార క్షేత్రంలో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యాన నిర్వహించిన మూడురోజుల త్యాగయ్య ఆరాధనా సంగీతోత్సవాల ముగింపు సభలో ఆమె తన కోమల స్వరంతో రాగరాజుకు స్వరార్చనలు చేశారు.

HAMSINI-NAGENDRAజగదానందకారకా కృతితో ప్రారంభించి వరుసగా త్యాగరాజస్వామి రచించిన పంచరత్న కృతులను, సంగీత త్రిమూర్తుల సాహిత్యంలోని మణిపూసల్లాంటి కీర్తనలనూ ఆలపించి పెద్దసంఖ్యలో హాజరైన సంగీత రసజ్ఞులను పరవశింపజేశారు. రాగాలాపనలో తనదైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ రెండున్నర గంటలపాటు నాదయోగి త్యాగయ్యకు రాగనీరాజనాలు అర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన అంధత్వం సంగీత సాధనకు ఏమాత్రం అడ్డుగోడగా నిలవలేదన్నారు. దృష్టి లేకపోయినా భగవంతుడు ప్రసాదించిన జ్ఞాననేత్రాలతో తాను చూడగలుగుతున్నానని, ఓ సంగీత విద్వాంసురాలినైనందుకు గర్విస్తున్నానని అన్నారు. తాత, తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం, పద్మభూషణ్‌ మధురై టిఎన్‌ శేషగోపాలన్‌ ఆశీర్వాదంతో ఆ మహావిద్వాంసుని వద్ద సంగీతంలో ఎన్నో మెలకువలు తెలుసుకోగలిగానని హంసినీ నాగేంద్ర ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top