You Are Here: Home » చిన్నారి » ఆనందుడి అపరాధం

ఆనందుడి అపరాధం

పూర్వం ఒక విశ్వవిద్యాలయంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గర చాలా విలువైన పుస్తకాలు ఉండేవి. అందులో కొన్ని వెల కట్టలేనివి. ఒక రోజు ఆనందుడనే ఒక విద్యార్థి ఆయన్ను కలుసుకోవడానికి ఇంటికి వచ్చాడు. ఎవరూ చూడకుండా ఒక పుస్తకాన్ని తస్కరించాడు. ఆనందుడు ఇంటి నుండి వెళ్ళిపోగానే పుస్తకం పోయిందన్న విషయం పసికట్టాడు పండితుడు. వెంటనే ఎవరినైనా పంపించి ఆ పుస్తకాన్ని ఆనందుడి నుండి వెనక్కి తెచ్చుకోవచ్చు. అయినా ఆ పండితుడు మిన్నకుండి పోయాడు.

ఆ పుస్తకాన్ని అమ్మడానికి ప్రయత్నించాడు ఆనందుడు. చివరకు ఒక విద్యాధికుడైన ఒక ధనవంతుడు ఆ పుస్తకాన్ని కొనడానికి ముందుకు వచ్చాడు. అయితే ధనవంతుడు ఆ పుస్తకం విలువను అంచనా వేయడానికి ఒకరోజు ఆ పుస్తకం తన దగ్గర వదిలేయమని ఆనందుడితో చెప్పాడు. ఆయన ఆ పుస్తకాన్ని పండితుడి దగ్గరకు తీసుకెళ్ళాడు. పండితుడు ఆ పుస్తకాన్ని గుర్తుపట్డాడు. అయినా మౌనంగా ఉండిపోయాడు.

‘‘ఒక యువకుడు దీన్ని నాకు అమ్మాలనుకుంటున్నాడు. పది బంగారు నాణేలు అడుగుతున్నాడు. మీకు పుస్తకాల గురించి బాగా తెలుసు. ఇది అంత విలువ చేస్తుందా?’’ అని ధనవంతుడు అడిగాడు.

‘‘అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ విలువ చేస్తుంది. ఇది వెలకట్ట లేని పుస్తకం.’’ అని చెప్పాడు పండితుడు.

మరునాడు తన దగ్గరకు వచ్చిన ఆనందుడితో అతను అడిగిన ధనం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ధనవంతుడు. ‘‘ఎవరికి చూపించారు?’’ సంతోషంగా అడిగాడు ఆనందుడు.

ధనవంతుడు చెప్పిన వివరాలు వినగానే అతని ముఖం పాలిపోయింది. ‘‘నా ఉద్దేశ్యం మార్చుకున్నాను. ఈ పుస్తకం అమ్మను’’ అంటూ ధనవంతుడు ధర పెంచి ఇస్తానని అంటున్నా వినకుండా అక్కడినుండి వచ్చేసాడు ఆనందుడు. సరాసరి పండితుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు పుస్తకం అందించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు.

‘‘నేను మీ పుస్తకం దొంగలించిన దొంగను. విషయం తెలిసీ మీరు నన్నెందుకు పట్టుకోలేదు’’ ఆనందుడు అడిగాడు.

‘‘నాయనా, ఒకవేళ నువ్వు ఆ పుస్తకాన్ని దొంగలించలేదు, నేనే నీకిచ్చానని చెబితే దొంగతనంతో పాటు అబద్దం ఆడిన పాపాన్ని కూడా నువ్వు మూట కట్టుకుంటావు. నువ్వు దొంగతనం చేసావని అందరికి తెలిసిందన్న భావన నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. నువ్వు దాన్ని తీసుకున్న రోజే నేను ఆ పుస్తకాన్ని నేనే నీకిచ్చాను అని నా మనసులో పదే పదే అనుకున్నాను. దానితో నీ అపరాధం కొంతనైనా తగ్గుతుందని ఆశించాను.’’ అంటూ ఆనందుడి వీపును ఆప్యాయంగా తట్టాడు పండితుడు. ఆనందుడికి మాట కరువైంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top