You Are Here: Home » ఇతర » ఆధ్యాత్మిక చుక్కానులు మాతాజీలు

ఆధ్యాత్మిక చుక్కానులు మాతాజీలు

మహిళలు జీవన గమనంలో అనేక అద్భుతాలు సృష్టిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతని నిలుపు కుంటున్నారు. అందుకు తమ సాాయశక్తులా ఎంతో కృషి చేస్తున్నారు. వారు అందరికీ ఆదర్శంగా నిలవడమే కాకుండా, సమాజానికి కూడా ఇతోధికంగా సేవలందిస్తు న్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ మేమే ముందు అంటూ సాగుతున్న మహిళా మణులు, ఆధ్యాత్మిక పరంగా కూడా సమాజాన్ని చైతన్య పరుస్తున్నారు. మానవ మనుగడకి ఆధ్యాత్మికత ఒక చుక్కాని వంటిది. జీవితం సంసార సాగరంలో ఒక నావవంటిది. తీరం చేరాలంటే దీప స్థంభం దారిచూపించాలి. అటువంటి ముక్తిమార్గాన్ని చూపించడంలో కూడా మహిళలు ఆధ్యాత్మిక పరంగా తమ సేవలందిస్తున్నారు.
ammaమాతా అమృతానందమయి, సాయి మాతా, ఆనందమూర్తి గురు మాతా, గురుమయి చిద్విలాసానంద వంటి ఆశ్రమ మహిళలు ఎందరో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ సామాన్యుల్ని సన్మార్గంవైపు నడిపిస్తున్నారు. అటువంటి మాతల్ని ఒకసారి కలిసి దీవెనలు అందుకుందాం..

1999లో గురుమాతాజీ ఉపన్యాసాలు సోనీ టెలీవిజన్‌లో రోజూ ఉదయాన్ని ప్రసారం అవ్వడంతో క్రమేణా ప్రజాదరణ పొందుతూ వచ్చింది. ఈమె అనుచరులు ప్రతిఏటా రెండుసార్లు హృషీకేశ్‌లో మెడిటేషన్‌ నిర్వహించడం మొదలు పెట్టారు. మాతాజీ హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో గల గనౌర్‌లో ఆశ్రమాన్ని స్థాపించింది. ఈ ఆశ్రమంలో సుమారుగా 500కు పైగా శిష్యులు నివాసం ఉంటున్నారు. ఈమె హిందూ, సిక్‌, ముస్లిం, బౌద్ధ మత గ్రంధాల మీద ఆధ్యాత్మిక ప్రవచనాలు గావిస్తూ అందరినీ ఒక తాటిమీద నిలబెడుతోంది. అనేక మంది ఆధ్మాత్మిక గురువులు అందించిన మహాగ్రంధాల సారాంశాన్ని అందరికీ అందిస్తూ, దేశవిదేశ ప్రజలందరినీ ఆధ్యాత్మిక పరంగా సంఘటితం చేస్తోంది.

ఆనందమూర్తి గురుమాతా జీ
05dheeraఈమె 1966 ఏప్రిల్‌ 8న పంజాబ్‌లోని అమృతసర్‌లో పుట్టింది. కాన్వెంటు స్కూల్లో చదివి, ఆర్ట్‌‌సలో డిగ్రీ చేసింది. బాల్యంలో ఈమె తన తల్లితో ఆధ్మాత్మిక ప్రసంగాలకి, సత్సంగాలకీ, భజనలకీ హాజరవుతూవుండేది. ఇంటికి వచ్చే సాధువులతో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేది. కొందరు మహాత్ములు ఈమెను ఆధ్యాత్మిక పరంగా శిఖరాగ్రాలకు చేర్చారు. ఈమె తన 16వ ఏటకే మంచి ఆధ్యాతిక శక్తి గల వ్యక్తిగా గుర్తింపుని పొందింది. అయినా ఈమె వెలుగులోకి రావడానికి ఏళ్ళతరబడీ తపస్సు చేయలేదని అందరిలాగే ఆటలు ఆడుకుంటూ, అదనపు విద్యాకళల్లో పాల్గొనేదాన్ననీ చెప్తూవుండేది. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈమె ఆటపాటలతోనే గడిపేది. అయినా ఆధ్యాత్మిక పరంగా ఈమె అవధులు దాటిన అవధూత అని చెప్పవచ్చు.

మాతా అమృతానందమయి
ఈమెను తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె ఆధ్యాత్మిక ఆలింగనంలో స్వాంతన చెందని వారు చాలా అరుదు. దేశవిదేశాల్లో ఈమెకు అనూహ్యమైన శిష్యసంతతి ఉందంటే, ఈమెలోని దైవశక్తి ఎంతటి గొప్పదో ఇట్టే అవగతం అవుతుంది. ఈమె అసలుపేరు సధామణి ఇడమన్నేల్‌. ఈమె 1953లో కేరళలోని కొల్లామ్‌ జిల్లాలో ఉన్న అలప్పాడ్‌ గ్రామానికి చేరువలో ఉన్న పారాయకాడవు అనే కుగ్రామంలో జన్మించింది. 5వ ఏటలోనే చదువుకు స్వస్తిచెప్పి, పూర్తిగా ఇంటిపనులకే మరిమితమయ్యింది.

తీవ్ర దారిద్య్రం, ఇతర సమస్యలు ఈమెను ఎంతో ప్రభావితంచేసాయి. పేదవారికి తన ఇంటనున్న ఆహారం, దుస్తులు వంటివి ఇవ్వడంతో ఇంట్లో ఈమెను కొట్టడం, తిట్టడం వంటి ఇబ్బందులు పెట్టేవారు కుటుంబసభ్యులు. ఈమె దుఃఖంలో ఉన్నవారిని ఆలింగనం చేసుకుని ఓదార్చేది. అందరూ దీనిని వ్యతిరేకించినా ఈమె లక్ష్యపెట్టలేదు. 1981లో ఈమె మాతా అమృతానందమయి మఠాన్ని స్థాపించింది. నాటినుంచీ నేటి వరకూ ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు అందిస్తూ ఈమె అందరికీ తల్లిగా ఆవిర్భవించింది. కొంతకాలానికి ఈమె ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చీలి, దుబాయ్‌, ఇంగ్లాండ్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హాలాండ్‌, ఐర్లాండ్‌, ఇటలీ, జపాన్‌, కెన్యా, కువైట్‌, మలేషియా, మారిషస్‌, రష్యా, సింగపూర్‌, స్పెయిన్‌, శ్రీలంక, స్వీడన్‌, అమెరికాతో సహా ప్రపంచదేశాలన్నీ పర్యటించి భక్తిప్రసూనాలు మానవాళికి పంచిఇచ్చింది.

మహాకుంభ మేళాలో అమ్మ
amma3అమ్మ దేశ పర్యటనలో భాగంగా తన బృందంతో కలిసి అనేక ప్రాంతాలు తిరుగుతూ 1500 కి.మీలు పైగా ప్రయాణించి బృందావన్‌ మీదుగా కలకత్తా చేరింది. అక్కడ తన బృందాన్ని మహాకుంభమేళాకు వెడదామా? వెడదాం అనేవారంతా చేతులెత్తండి అంటూ నవ్వుతూ అడిగింది. అందుకు అందరూ చేతులు ఎత్తి మద్దతు ప్రకటించడంతో శిష్యసమేతంగా మొన్న కుంభమేళాకు చేరి, అందరితోపాటు అమ్మ కూడా పుణ్య నదీ సంగమ స్నానాన్ని ఆచరించింది. గాయిత్రీ మంత్ర జపంతో అందరూ గంగలో మునిగి భక్తితో స్నానాలు ముగించారు. ఈ విధంగా మాతా అమృతానందమయి తన ఆధ్యాత్మిక తరంగాలతో ప్రపంచ ప్రజలందరినీ సన్మార్గం వైపు నడిపించడంలో తాను అనందాన్ని పొందుతూ, అందరినీ ఆనంద పరవశుల్ని చేస్తోంది.

సారుూ మా
sai-maaఈమె కొలరాడోకు చెందిన సత్యసాయి బాబా భక్తురాలు. ఆయన ప్రేరణతో ఈమె ఎంతో పవిత్రత చెంది, ఆధ్యాత్మిక గురువుగా మారింది. ఈమెను సాయి మాతాజీ అనీ, సాయి మా లక్ష్మీ దేవి అని పిలుస్తారు. ఈమె ప్రబోధాలతో ఎందరో ఈమె మార్గాన్ని అనుసరించారు. మానవత్వం, సంఘటితత్వం ఈమె లక్ష్యాలు. ఈమె కొలొరాడోలోని క్రిస్టోన్‌ అనే ప్రాంతంలో ఎంతో సుందరమైన ఆశ్రమాన్ని స్థాపించి ప్రపంచదేశాల్లో అనేక మందిని తన ఆధ్యాత్మిక ప్రవచనాలతో చైతన్యవంతుల్ని చేస్తోంది.

ఈమె 1953 ఆగస్ట్‌ 2న మారిషస్‌లో భారతీయ దంపతులకు జన్మించింది. మాతాజీ తన చిన్నతనంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసింది. చదువు పూర్తిచేసిన తర్వాత ఫ్రాన్స్‌లో చాలా కాలం నివాసం ఉండి అక్కడ ఫిలాసఫీ, కపాల శల్యవైద్యం (క్రానియల్‌ ఆస్టియోపతి), సాహిత్యం, భాష మొదలైన వాటిని అభ్యసించింది. అలాగే మరికొంతకాలం అమెరికా, కెనడాల్లో ఉండి అక్కడ చూడగానే వైద్యం (ఇట్యూటివ్‌ మెడిసెన్‌), శక్తి వైద్యం (ఎనర్జీ హీలింగ్‌) అభ్యసించి భారతదేశానికి తరచూ వస్తూ, ఇక్కడ యోగా, మెడిటేషన్‌లలో కూడా అనూహ్యమైన శిక్షణ తీసుకుంది. మాతాజీ అనేక యోగాల్లో మాస్టర్‌గా యోగ్యతా పత్రాలు పొందింది. అమెరికా, కెనడా వంటి దేశాల్లో యోగా తరగతులు, ఆధ్యాత్మిక ప్రబోధాలు నిర్వహిస్తూ ప్రపంచ ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తోంది.

మీరా మాత
Mother-Meeraఈమె మన స్వచ్ఛమైన తెలుగునాట పుట్టిన సాధ్వి. ఈమె నల్లగొండ జిల్లాలోని చందేపల్లి అనే కుగ్రామంలో డిశంబర్‌ 26, 1960లో పుట్టింది. ఈమె అసలు పేరు కమలా రెడ్డి. ఈమె తన 6వ ఏటనే ఆధ్యాత్మిక సమాధిలోకి వెళ్ళిపోయింది. రోజంతా అలాగే సమాధిస్థితిలో ఉండిపోయింది. ఆతరువాత ఈమె 12వ ఏట ఈమె మేనమామ బులుగూరు వెంకటరెడ్డి ఈమెలోని ఒక అద్భుత శక్తిని దర్శించి, గుర్తించాడు. నాటినుండి ఈమెను జాగ్రత్తగా, చూసుకుంటూ వచ్చారు. ఈమె తల్లిదండ్రులు చిత్తూరులోని మదనపల్లిలో ఉండేవారు. 1974లో పుదుచ్చెరీలోని అరవిందాశ్రమానికి వెళ్ళడం తటస్థించింది. అక్కడ ఈమె తొలిసారిగా పాశ్యాత్య దేశాలవారిని కలిసి, దర్శనం ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ కోవలో 1979లో ఈమె భక్తులు మాతాజీని కెనడాకు ఆహ్వానించారు. 1981లో మీరామాత వెస్ట్‌ జర్మనీకి తొలిసారిగా వెళ్ళింది. అక్కడ తన తొడుగా వచ్చిన ఆదిలక్ష్మితో కలిసి ఒక సంవత్సరంపాటు నివాసం ఉంది. ఇక ఈమె ఆధ్యాత్మిక భావతరంగాలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవిదేశాల్లో ఎందరికో దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ, చిరునవ్వుతూ ఆదరిస్తూ ఎందరినో భక్తిమార్గానికి చేరుస్తోంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top