You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » ఆత్మన్యూనతను విడనాడండి

ఆత్మన్యూనతను విడనాడండి

మనకు ఎదురయ్యే సంఘటనలు, మనం ఊహించుకునే ఆలోచ నలు మొదలైనవన్నీ మనపై ప్రభావం చూపుతాయి. వాస్తవాలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించడం, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మన లక్ష్యాలను నిర్ణయించుకోవడం అవసరం. వాస్తవాలను అంచనావేయడంలో పొరపాటు జరిగితే లక్ష్య సాధనలో వైఫల్యాన్ని చవి చూడాల్సి వస్తుంది.
ఒక కార్యాన్ని సాధించాలనుకునే వారు వాస్తవాలను వదిలి, కలలతో, ఊహాలోకంలో విహరిస్తూ తమ కార్యసాధనకు అంతరాయం కలిగించుకోరు. ఊహాలోకంలో విహరిస్తూ, భవిష్యత్తును కూడా ఊహలకే పరిమితం చేసుకునేవారు ఆ సమయంలో తాత్కాలికంగా ఆనందంగా గడుపగలుగతారేమో కాని, వాస్తవ జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా జీవిస్తారు. ఈ రకమైన వ్యక్తిత్వం కలిగిన వారికి సమయం వృధాకావడమే తప్ప మరేవిధమైన ఉపయోగమూ ఉండదు. మరొక రకపు వ్యక్తిత్వమున్న వారు కూడా మనకు కనిపిస్తుంటారు. వీరు పూర్తిగా అవాస్తవిక భావాలతో జీవిస్తుంటారు.
అపనమ్మకం, అవిశ్వాసం వంటి లక్షణాలు కలగడానికి కారణం అజ్ఞానం, అవగాహనారాహిత్యం. తాము చేసే పనిపై అవగాహన లేకపోతే సరైన పద్ధతిలో లక్ష్యసాధన దిశగా ప్రయాణించలేరు. ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థంకాని స్థితిలో కొట్టుమిట్టాడుతారు. పలితంగా ఇటువంటి వారికి తమపై తమకే నమ్మకం తగ్గుతుంది. తాము ఎందుకూ కొరగానివారమనే అభిప్రాయంతో వారిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది.
ఆత్మవిశ్వాసం లేకపోతే ధైర్యం తగ్గిపోతుంది. ఏ పనినైనా చేయగలమో లేదోననే భయం వెన్నాడుతుంటుంది. ఒకవేళ ఏదైనా పని ఆరంభించినా, తగిన ఫలితం రాదేమో అనే సందేహం కలుగుతుంది. దీని కారణంగా అసహనమేర్పడుతుంది. నిలకడగా పని చేయలేరు. మనల్ని మనం విశ్వసించలేని స్థితి కలుగుతుంది. ఇదే ఆత్మన్యూనతాభావానికి దారి తీస్తుంది.
ఆత్మన్యూనతాభావానికి గురైన వ్యక్తులు తమను తాము విశ్వసించుకోలేరు. వారిపైన వారికే సరైన అవగాహన ఉండదు.  దేనినీ సానుకూల దృక్పథంతో చూడలేరు. వీరికి ప్రతి అంశమూ వ్యతిరేకంగానే కనిపిస్తాయి. వీరిలో ప్రబలిపోయే ఈ నెగటివ్‌ ధోరణి కారణంగా ప్రతి పనిలోనూ ప్రతికూల ఫలితాలే కనిపిస్తాయి.
ఆత్మన్యూనత కలిగిన వ్యక్తులు ఏ పనినీ చేయలేరు. అసలు చేయాలని అనుకోరు కూడా. దీనికి ప్రధాన కారణం ఆ పని తాము చేయలేమేమోననే భావన. ఒకవేళ చేసినా సత్ఫలితాలు రావేమోననే భయం. తాము చేయాలనుకున్న పనిని మొదలెట్టినా, సరైన అవగాహన లేనందువల్ల ఆ పని సక్రమంగా చేయలేకపోతారు. దీనితో సత్ఫలితాలు లభించవ్ఞ. దీనితో తాము చేతగానివాళ్లమనే అభిప్రాయం వారిలో మరింతగా స్థిరపడుతుంది.
ఆత్మన్యూనత కలిగిన వ్యక్తులు తమకు ఎదురయ్యే ఏ సమస్యనూ పరిష్కరించుకోలేని స్థితిలో ఉంటారు. ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూస్తూ ఆందోళన చెందుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేరు. ప్రతి విషయంలోనూ వారిలోని నెగటివ్‌ ఆలోచనా దృక్పథమే ముందుకు వస్తుంది. తాము వైఫల్యం చెందినప్పుడు విచారించడమే కాకుండా, ఎదుటి వారు విజయం సాధించినప్పుడు కూడా తమనే నిందించుకుంటారు.
ఏదేని లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తులు ముందుగా తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకోవాలి. అవసరానుగుణంగా వాటికి మరింత పదును పెట్టుకోవాలి. ఆత్మన్యూనతతో బాధపడేవారు ఆత్మన్యూనతనుంచి బైటపడటానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. తమ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకోవాలి. నలుగురితో కలిసిమెలిసి జీవించాలి.
ఎదుటివారి విజయాలకు కారణమేమిటి? తాము ఎక్కడ పొరపాటు చేస్తున్నామనే అంశాన్ని గ్రహించగలగాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించగలగాలి. అపజయాలు విజయానికి సోపానాలని గుర్తించి, గతంలో చేసిన పొరపాట్లను విడనాడి, విజయం వైపుగా పయనించాలి. ఇలాంటివన్నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగితే లక్ష్య సాధన కూడా సులభమవ్ఞతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top