You Are Here: Home » చిన్నారి » అమ్మా… ఎలా ఉన్నావ్?

అమ్మా… ఎలా ఉన్నావ్?

ఒన్ ఫైన్ మార్నింగ్ అనురాధ చనిపోయింది.
యాభై ఏళ్ల అనురాధ, కొడుకును బాగా చదివించి అమెరికాలో సెటిల్ చేసి నలుగురి వైపు గర్వంగా చూసిన అనురాధ, అమ్మాయికి పట్టుబట్టి అమెరికా అబ్బాయికిచ్చి పెళ్లి చేసి, కూతురు అమెరికాలో ఉందటమ్మా అని నలుగురూ
అనుకుంటూంటే విని దిలాసాగా నవ్వుకున్న అనురాధ, ఇల్లు కట్టి, కుటుంబాన్ని సెటిల్ చేసి, మరుసటి రోజు ఉదయం నాష్టా కోసం పప్పు నానబెట్టి, రాత్రి

పదకొండు వరకూ నిక్షేపంలా ఉన్న అనురాధ చెప్పాపెట్టకుండా మరోమాట లేకుండా చనిపోయింది.
సో వాట్? ఈ దేశంలో ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఎవరో ఒక అనురాధ చనిపోతూనే ఉంటుంది. అందులో విశేషం ఏముంది? మీకు తెలియాలా…. అయితే వినండి.
నిద్రపక్క మీద అనురాధ చనిపోగానే, దుప్పటి తీసి, చెక్ చేయబోయి కొయ్యబారిపోయాడు భర్త సూర్యారావు. ఎందుకు? అనురాధ శవం తెల్లగా మారిపోయి ఉంది. సున్నపురాయిలా మారిపోయి ఉంది. ఆమె డెడ్‌బాడీ- చీరా రవిక తొడుక్కున్న సుద్దముక్కలా మారిపోయి ఉంది. విడ్డూరం. బహుశా ఇలా
జరగడం ఈ లోకంలో ఇదే మొదటిసారేమో. ఇంతకీ ఈ జబ్బు పేరేమిటీ?

వీధిలో వాళ్లూ వీళ్లూ వచ్చారు. కాలనీలో వీళ్లూ వాళ్లూ వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. ముక్కున వేలేసుకున్నారు. అదే కాలనీలో ఉంటున్న ఒక చురుకైన పిల్ల, రహస్యంగా ఆ శవం నుంచి కొంచెం ముక్క పుటుక్కున గిల్లి, కుతూహలం ఆపుకోలేక ల్యాబ్‌కు పరిగెత్తింది. అక్కడ పరీక్షించి చూసింది. ఇంతకీ ఆ ముక్క ఏమిటో తెలుసా?
ఆస్ప్రిన్ టాబ్లెట్.
వెంటనే ఆ పిల్ల భూతద్దం తీసుకొచ్చి అనురాధ డెడ్‌బాడీని పరీక్షగా చూసింది. అనురాధ ఒళ్లంతా
టాబ్లెట్‌లే. తెల్ల ట్యాబ్లెట్లు, నల్ల ట్యాబ్లెట్లు, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్….
ఇలా ఎలా జరిగింది? అనురాధ ఒళ్లు ఒక మందు బిళ్లలా ఎలా మారిపోయింది? మళ్లీ మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి.

పైకి జరిగింది ఇది: అనురాధను అందరూ ఒక మంచి తల్లి అనేవారు. సమర్థురాలైన తల్లి అనేవారు. సూపర్ తల్లి అనేవారు. ఉద్యోగం చేస్తూ కూడా ఇద్దరు పిల్లల్ని, భర్తను అంత బాగా చూసే
వాళ్లెవరున్నారు అని అనేవారు. ఇల్లు ఎంత నీటుగా ఇంకెవరు ఉంచుకోగలరు అనేవారు. వెచ్చాలు అంత పొదుపుగా వాడేవారు ఎవరున్నారు అనేవారు. ఆ పొగడ్తలు అనురాధకు ఇష్టం. వాటి కోసం ఎంతైనా కష్టపడేది. కోడి కూయక ముందే నిద్ర లేచేది. మొగుడు లేచే లోపలే అన్ని పనులూ ముగించేది. పని మనుషులు శుభ్రంగా చేస్తారా చస్తారా అని తనే అన్ని పనులూ చేసేది. పిల్లలు ఒక్కొక్కరు ఏది తింటారో ఎంచి వాటన్నింటినీ వండేది. మళ్లీ బ్యాంకు ఉద్యోగం. రాత్రికి వంట. మళ్లీ పిల్లల పనులు. లోను తీసుకొని మధ్యలో ఇల్లు కట్టించింది. అబ్బాయి అమెరికా వెళ్లడానికి రేయింబవళ్లు చదివించింది. అమ్మాయి పెళ్లి కోసం అప్పు చేసింది. కాన్పు సమయానికి మళ్లీ అమ్మాయి దగ్గర ఉండేందుకు సెలవలు పెట్టకుండా విశ్రాంతి తీసుకోకుండా ఉద్యోగం చేయసాగింది… ఇవన్నీ ఆమె సక్సెస్ స్టోరీలు.

కాని, లోపల జరిగింది ఇది: రోజూ ఇంత హడావిడి చేసీ చేసీ అనురాధ అలిసి పోయేది. బ్యాంకు నుంచి వస్తూ వస్తూ తలనొప్పి మాత్ర వేసుకునేది. పదిహేనేళ్లుగా రోజుకో మాత్ర. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలంటే ఆమెను అనారోగ్యాలు చికాకు పెట్టకూడదు. కనుక జ్వరం వస్తే క్రోసిన్ వేసుకునేది.

నడుమునొప్పికి బ్రూఫిన్. ఇక ఫంక్షన్లూ, శుభకార్యాలూ, ఆఫీసులో ఇన్స్‌పెక్షన్‌లూ అని ఒక్కోసారి ఆ మూడురోజులను మాత్రలతో వెనక్కు నెట్టేది. పిల్లల పరీక్షల టైములో నిద్ర రాకుండా మాత్రలు వాడేది. ఆ తర్వాత నిద్ర పట్టక నిద్ర కోసం మళ్లీ మాత్రలు వాడేది. ఓవర్ బ్లీడింగ్ మొదలైతే దానికీ మాత్రలు. గర్భసంచీ తీసేయిస్తే మంచిది అంటే సర్జరీ. ఆ పైన సప్లిమెంట్స్ కోసం మళ్లీ మాత్రలు. హాన్మోన్ల కోసం మాత్రలు. బి.పి, బ్లడ్ ప్రెషర్ ఎలాగూ వస్తాయి కాబట్టి వాటికి మాత్రలు. మాత్రలు… మాత్రలు… మాత్రలు…

వాడి వాడి ఆమె దేహమే ఒక మాత్ర అయిపోయింది.
ఈ సంగతి ఎవరికీ తెలియదు. కాని పైకేమో అనురాధ మంచి అమ్మ, చక్కటి అమ్మ, సమర్థురాలైన అమ్మ, మొగుణ్ణి అవస్థపెట్టని అమ్మ, ఇరుగు పొరుగును ఇబ్బంది పెట్టని అమ్మ. పెద్ద ఇమేజ్. నిజానికి ఇది ఇమేజ్ కాదు. జబ్బు. పెద్ద జబ్బు. తరతరాలుగా తల్లుల్ని వేధిస్తున్న జబ్బు.
దీని పేరే సూపర్‌మామ్ సిండ్రోమ్.

అనురాధ డెడ్‌బాడీని పరీక్షించి ఇదంతా అర్థం చేసుకున్న ఆ పొరుగింటి పిల్ల ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడ లేదు. పరిగెత్తింది. వెర్రిగా పరిగెత్తింది. భయంతో ఆందోళనతో కంగారుతో అభద్రతతో పరిగెత్తింది.
ఎక్కడికో తెలుసా? ఇంటికి. తల్లిని పలకరించడానికి. తల్లిని గుండెలకు హత్తుకోవడానికి. హత్తుకుని, అమ్మా… ఎలా ఉన్నావ్… నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడానికి. మాకు నువ్వు కావాలి… నీ చిరునవ్వు కావాలి… నీ ప్రాణాలు కావాలి…. మా శిరస్సుల మీద నీ చల్లని చేయి అండ కావాలి… దయచేసి నువ్వు విశ్రాంతి తీసుకో… అని అరిచి చెప్పడానికి ఆ పిల్ల పరిగెత్తింది.
కథ ముగిసింది.

రచయిత్రి పి.సత్యవతి అద్భుతమైన శిల్పంతో రాసిన అరుదైన కథ ‘సూపర్ మామ్ సిండ్రోమ్’.
నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి తెలుగు కథ ఇది. ప్రపంచంలోని ప్రతి అమ్మ కథా ఇది. బయటకు నవ్వుతూ కనిపించే అమ్మ లోలోపల ఎలా ఉందో… ఏ దిగులుతో ఉందో… ఏ అనారోగ్యంతో ఉందో… అని మనమందరం మన తల్లుల గురించి కన్సర్న్ ప్రదర్శించేలా చేసే, వారి గురించి ఆలోచించేలా చేసే కథ ఇది.
ఇంకెందుకు ఆలస్యం.
అర్జెంటుగా అమ్మతో మాట్లాడండి. ఆమెకు ఏం కావాలో చూడండి. ఆమెకు విశ్రాంతి ఇవ్వండి. ఈ కథను చింపి పడేసి ఇది మా అమ్మది కాదు అని ధైర్యంగా అనగలిగే పరిస్థితిలో ఉండండి. ఉంటారా?
– సాక్షి ఫ్యామిలీ

పి.సత్యవతి: కథను కరుకైన కత్తిలా ఉపయోగించి మగవాళ్ల బండ హృదయాలను కోసి పడేసిన రచయిత్రి. స్వస్థలం గుంటూరు జిల్లా కొలకలూరు. ఇల్లలకగానే… వీరి ప్రసిద్ధ కథా సంపుటి. మరో రెండు సంపుటా లున్నాయి. ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. నివాసం విజయవాడ. ఫోన్: 9848142742

send your response to sakshikatha@gmail.com

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top