You Are Here: Home » సఖి » రుచి » అభి‘రుచి’కి ఆరో ప్రాణం

అభి‘రుచి’కి ఆరో ప్రాణం

పెప్పర్‌ దోసె
ఇది త్వరగా చేసుకునే ఇన్‌స్టాంట్‌ రవ్వదోసె. ఆఫీసులకీ, స్కూళ్ళకీ బాక్స్‌ల్లో సర్ధుకుని లంచ్‌గా కూడా తీసుకువెళ్ళవచ్చు. ఎంతో తేలికగా జీర్ణమయ్యే ఈ దోసెలు పుష్టిగాను, ఆరోగ్యవంతంగానూ కూడా ఉంచుతాయి.

తయారీకి కావలసినవి
pepar

బియ్యం పిండి    : 1 కప్పు, 
మైదా : 1/4 కప్పు,
మజ్జిగ : 4 కప్పులు (కాస్త పులిసినదైనా మరీ బాగుంటుంది)
అల్లం : చిన్న ముక్క (తొక్కడుగా దంచుకోవాలి)
పచ్చిమిర్చి : 4 (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),
పెప్పర్‌ కార్న్‌(మిరియాలు) : 1 చెంచాడు, (పొడి చేసుకోవాలి)
జీలకర్ర : 1 చెంచాడు,
కొత్తిమీర : 1 కప్పు

తయారు చేసే విధానం
ముందుగా ఒక బౌల్‌లో దోసె కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని వేసి, నాలుగు కప్పుల నీళ్ళు పోసి చిక్కగా దోసె పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద దోసెల పాన్‌ పెట్టి బాగా వేడి చేసి, సన్నని మంట మీద దోసె పిండిని తీసుకొని దోసెలా పోయాలి. దానిని రెండు వైపులా బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకూ కాలనిచ్చి తర్వాత తీసి సర్వింగ్‌ ప్లేట్‌ లో పెట్టి చట్నీ లేదా సాంబార్‌ తోటి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి. అంతే పెప్పర్‌ కార్న్‌ రవ్వ దోసె రెడీ. సైడ్‌ డిష్‌ చేసుకునే వీలులేకపోతే, ఇంటో రడీగా ఉన్న ఏ చెట్నీతో కలిపి తిన్నా అందరూ ఆహా.. అనవలసినదే.

ఎగ్‌ దోసె
సాధారణంగా దోసెలు ఎక్కువ శాకాహారానికి సంబంధించే ఉంటాయి. అయితే నాన్‌వెజ్‌ రుచి కావాలనుకునేవారు ఈ దోసెల్ని వేసుకోవచ్చు. ఎగ్‌ అందరికీ ఎంత పౌష్టికాహారమో వేరే చెప్పనక్కర్లేదు. పిల్లల ఎదుగుదలకి కూడా ఈ ఎగ్‌తో వేసిన దోసెలు ఎంతగానో సహకరిస్తాయి.

తయారీకి కావలసినవి

గుడ్లు         : 4 (పగులగొట్టాలి), 
పచ్చిమిర్చి : 2-4 (చిన్నగా, సన్నగా తరిగిపెట్టుకోవాలి),
ఉల్లిపాయలు :1 (చిన్నగా, సన్నగా తరిగిపెట్టుకోవాలి),
కొత్తిమిర తరుగు : 1/2 (చిన్నగా, సన్నగా తరిగిపెట్టుకోవాలి),
దోసెపిండి : 1 గిన్నెడు (200 గ్రాములు), నెయ్యి లేదా వెజిటేబుల్‌ ఆయిల్‌ : 2 చెంచాలు,
పెప్పర్‌ : 1 చెంచాడు,
ఓరిగానో : 1/2 చెంచా (అవసరమైతే వేసుకోచ్చు),
ఉప్పు : రుచికి సరిపడా

తయారు చేసే విధానం
eggముందుగా గుడ్డును పగులగొట్టి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత నాన్‌ స్టిక్‌ పాన్‌ను స్టౌ మీద పెట్టి, వేడెక్కిన తర్వాత అందులో ఒక చెంచా నెయ్యి గానీ, నూనె గానీ, వేసి పాన్‌ మొత్తానికి సర్ధాలి.ఆ తర్వాత సన్నని మంట మీద పెట్టి, దోసె పిండిని పాన్‌ మీద దోసెలాగా పోయాలి. దోసె పోసిన ఒక నిమిషం తర్వాత మరో చెంచా నూనెను దోసె మీద చిలకరించాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న గుడ్డు మిశ్రమాన్ని రెండు టేబుల్‌ స్పూన్లను పోసి దోసె మొత్తం సర్ధాలి. 30 నిముషాలు అలాగే ఉంచి తర్వత మరో సైడ్‌ తిప్పి మరో రెండు మినిముషాలు కాలనివ్వాలి. అంతే మంట తగ్గించి వేడి వేడి దోసె మీద పెప్పర్‌ పౌడర్‌ చిలకరించాలి. ఎగ్‌దోసె తయారైనట్టే. ఈ ఎగ్‌ దోసెను టమోటో లేదా చిల్లీ సాస్‌తో తింటే బలే మజాగా ఉంటుంది.

పోహా దోసె
దీనిని మనవాళ్లు చాలా అరుదుగా వేసుకుంటూవుంటారు. కొంతమందికి తెలియదు కూడా. ఈ దోసె చాలా మెత్తగా ఉంటుంది కనుక స్పాంజ్‌దోసె అని కూడా పిలుస్తారు. పోహా అంటే అటుకులు. ఇవి ఎంత శక్తినిస్తాయో అందరికీ తెలిసిన విషయమే. వీటితో తయారు చేసుకునే ఈ దోసెలు మంచి ఆరోగ్య సంపదని కలిగిస్తాయి.

తయారీకి కావలసినవి
poha

బియ్యం       : 2 కప్పులు, 
అటుకులు : 1/2 కప్పు,
చిక్కని పుల్లటి పెరుగు : 3 1/2 కప్పులు,
మెంతులు : 1 చెంచాడు,
వంటసోడా : చిటికెడు,
ఉప్పు : రుచికి సరిపడా,
నూనె : తగినంత

టమోటో చట్నీకి కావలసినవి:

పెద్ద టమోటాలు    : 2(చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), 
జీలకర్ర : 1 చెంచాడు,
పచ్చిమిర్చి : 2-3 (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),
ఇంగువ : చిటికెడు,
ఉప్పు : రుచికి సరిపడా,
నూనె : తగినంత

తయారు చేసే విధానం
ముందుగా అటుకులు, బియ్యాన్ని, మెంతులను, చిక్కటి పుల్లని పెరుగులో రాత్రంతా నాన బెట్టుకోవాలి. మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఈ పిండిలో ఉప్పు, వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన ఉంచుకోవాలి. తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి ఆ పైన ముందుగా రడీగా ఉంచుకున్న పిండిని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి. దోశ ఒక వైపు కాలిన తర్వాత, రెండో సైడు కూడా తిప్పి కాస్త కాలనిచ్చి, తీసేయ్యాలి. అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ… పాన్‌లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించి, టమోటో కూడా వేసి మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి, దానికి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్‌ పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడాకి ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి, తర్వాత గ్రైండ్‌ చేసి పెట్టుకొన్న పేస్ట్‌ వేసి బాగా కలిపి వేడి వేడి అటుకుల దోసె ఈ తయారైన టమాటో చెట్నీతో కలిపి తింటే మంచి పసందుగా ఉంటుంది.

వాటర్‌ దోసె…
ఇది కర్నాటకా నుంచి మనకి వచ్చిన వంటకం అని చెప్పవచ్చు. రొటీన్‌ దోసెలకన్నా, ఆకారంలోను, రుచిలోనూ కూడా ఈ నీటిదోసె కాస్త భిన్నంగా ఉంటుంది. పూర్తి కొబ్బరిపాలతో తయారుచేయబడే ఈ దోసెలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

తయారీకి కావలసినవి

బియ్యం      : 2 కప్పులు (బియ్యాన్ని కడిగి, రాత్రంతా నీళ్ళలో నాబెట్టాలి), 
పచ్చి కొబ్బరి తురుము: 1 కప్పు,
జీలకర్ర : 1 చెంచాడు,
ఉప్పు : రుచికి సరిపడా,
నూనె : తగినంత,
నీళ్ళు : పిండి రుబ్బుకోవడానికి సరిపడా

తయారు చేసే విధానం
waterముందుగా రాత్రి నానబెట్టి పెట్టుకొన్న బియ్యంలో నీరు వంపేసి ఆ బియ్యాన్ని, కొబ్బరి తురుమును మెత్తని పేస్ట్‌ లా (తగినన్ని నీళ్ళు కలుపుతూ) చిక్కటి పాలలా, పిండిని గ్రైండ్‌ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టి ఉంచాలి. (కొబ్బరి తురుము విడిగా కూడా గ్రైండ్‌ చేసి ఆ పాలను పిండిలో కలుపుకోవచ్చు). ఒక గంట తర్వాత గ్రైండ్‌ చేసిన పిండిలో జీలకర్ర, ఉప్పు, చెంచాడు నూనె వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు దోసెల పాన్‌ స్టౌమీద ఉంచి, వేడెకిన తర్వాత దోసె పిండిని దోసెలా వేయాలి. తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్‌ చిలకరించి మరో నిముషం పాటు వేగనివ్వాలి. ఈ దోసెను రెండో వైపు కాల్చనవసరం లేదు. పలుచగా ఉండటం వల్ల పూర్తిగా కాలుంటుంది. అప్పుడే మంచి టేస్ట్‌ ఉంటుంది. అంతే టేస్టీ నీరు దోసె రెడీ. నీరుదోసెను టమోటో చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో గానీ ఆరగిస్తే మంచి రుచిగా ఉంటుంది. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top