You Are Here: Home » చిన్నారి » అపకారికి ఉపకారం

అపకారికి ఉపకారం

ఓ గ్రామంలో రామేశం అనే రైతుండేవాడు. తనకున్న కొద్దిపాటి భూమిలోనే కష్టపడి పంట పండించుకునేవాడు. ఇరుగు పొరుగుకి సాయం చేసేవాడు. అతని పొలానికి కొద్దిదూరంలోనే కామేశం అనే మరో రైతుండేవాడు. చాలా స్వార్థపరుడు. ఎవరైనా పచ్చగా ఉంటే ఓర్వలేకపోయేవాడు.

ఆ యేడు వర్షాలు బాగా పడడంతో పాటు కుటుంబమంతా కష్టపడడంతో రామేశం పొలం బాగా పండింది. అది చూసి కామేశానికి కన్నుకుట్టింది. ఓ రోజు అర్ధరాత్రి రామేశం పొలానికి నిప్పుపెట్టాడు. దగ్గరలోనే కాపలా పడుకున్న రామేశం గభాల్న లేచి మంటలార్పేశాడు. అయితే అప్పటికే కొంత పంట తగలబడిపోయింది. ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పడటం ఇష్టం లేక ఊరుకున్నాడు.

తర్వాత ఓ రోజు రాత్రి రామేశానికి ఎవరివో ఏడుపులు వినిపించి లేచి బయటికి వచ్చి చూశాడు. కామేశం భార్య గుడ్లు తేలేసిన పిల్లాడిని ఒడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తోంది. సమయానికి కామేశం కూడా లేడు. రామేశం క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిల్లాడిని తన ఎడ్లబండిలో కూర్చోబెట్టుకుని, పదిమైళ్ల దూరాన ఉన్న వైద్యుడి ఇంటికి తీసుకెళ్లాడు.

సకాలంలో వైద్యసాయం అందడంతో పిల్లాడు తొందరగా కోలుకున్నాడు. మర్నాడు భార్య ద్వారా జరిగిందంతా తెలుసుకున్న కామేశం ‘‘సమయానికి దేవుడిలా వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడావు కానీ, నేను మాత్రం నీకు తీరని ద్రోహం చేశాను’’ అంటూ రామేశం చేతులు పట్టుకుని ఏడ్చాడు.

ఆ తర్వాత, కామేశం తన ప్రవర్తన మార్చుకుని, అందరితో స్నేహంగా ఉండసాగాడు.
నీతి: ఉపకారికి ఉపకారం చేయడం గొప్పకాదు, అపకారికి కూడా ఉపకారం చేయడం గొప్ప!

బాచి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top