You Are Here: Home » చిన్నారి » కవితలు » అడవితల్లికి అగ్నిపరీక్ష

అడవితల్లికి అగ్నిపరీక్ష

ఆకులు తెంచి అగ్నిలో వేసి
పచ్చదనానికే పరీక్షలా
కళ్యాణ ఘడియల్లో
మెడకు ఉచ్చు బిగించి
తోరణాల్లా ఉరితీస్తున్నారు
అంతర్‌ జాలంలో
కూరుకుపోయి

కళ్ళప్పగించి
శరీరాలను విప్పేసుకునేంత
నీచులు కారు
ఏ కర్కోటకుడో
వాకపల్లి కావలికి వచ్చి
తుపుక్కున తెంచి
నమిలి ఉమ్మితే తప్ప
మేఘాల నుండి జారి
మట్టితో మమేకమై
మొలకెత్తుతుంది
పవిత్రమైన అడవి తల్లిలా

ఓరి గురివిందా
మంగళ సూత్రంతో వచ్చి
పసుపు కొమ్ములో
పాతివ్రత్యాన్ని వెదుకు తావురా!
ఆ పాటి అర సోలెడు బియ్యం
తలంబ్రాలు జేసి తల మీద
పోసుకోలేమా ?

వీసమెత్తు బంగారంతో వచ్చి
సవాలక్ష పరీక్షలెందుకు ?
ధర్మా మీటరు
నోట్లో పెట్టినంత
సులువు కాదురా
కన్యత్వ పరీక్షలంటే
అడవి అగ్నితో

పునీతమౌతుంది
స్ర్తీలకు మౌనం మాత్రమేకాదు
అగ్ని జ్వాల లవ్వడం కూడా తెలుసు
(మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సామూహిక వివాహ వేడుకల సందర్భంగా గిరిజన స్ర్తీలకు ప్రభుత్వ అధికారులు జరిపించిన కన్యత్వ పరీక్షలకు నిరసనగా)

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top