You Are Here: Home » చిన్నారి » కవితలు » అగ్నిధార

అగ్నిధార

ప్రార్ధనా శిలల మధ్య మారణాయుధం పహారా కాస్తోంది
ఇసుక గర్భాన్ని చీల్చి మానవత్వాన్ని పూడ్చి పెట్టుకున్నాక
మనిషికీ మతానికీ మధ్య మనసు నలుగుతోంది
తల్లీ ‘మలాలా’ గుప్పెడు అక్షరాల కోసం
మతంతో నిండిన నూనె వాగుల్ని దాటావా…
ఎక్కడినుంచో దగ్గరవుతున్న ఛాందస కుక్కల
గుండెను చీల్చే కేకలు నీకు వినిపించలేదా
మతం నీడ ఎప్పుడూ మనిషిని వెంటాడుతూనే ఉంది తల్లీ
జన్మంతా ఖాళీ చేసుకున్నాక కూడా

బ్రతుకు గాయం మనల్ని ఎప్పటికీ విడవనట్టు
ద్వీప విషాదంతో దువా చేస్తున్నప్పుడే
మెడ మీదకి పగిలిన గాజు చేతులు కర్కశంగా చేర్తాయి
సర్పాల్ని కుప్ప పోసుకుని కాంతి దీపాల వెలుగులో
జన్మని అభిషేకిస్తున్పప్పుడు
రాత్రులన్నీ శిథిలమైపోయి ఒక్కొక్కటిగా
ఎక్కడో ఆకాశపు గోడల మధ్య కన్పించని స్వర్గం వెైపుకి

మతం పరచిన దారులలో నిర్దాక్షిణ్యంగా నడిపిస్తాయి
గర్భ ఖండాల్ని చిదిమే సిద్ధాంతాల్ని ధిక్కరించగల్గిన అస్తమ్రా
యాతనని గుండె మూలాలనుంచి పెకిలించి
పావురంలా పెైకి ఎగరేసిన సాహసీ
మతాన్ని మందుపాతరతో పేల్చగల శక్తిమంతురాలా
మలాలా … మలాలా… మలాలా
ఇక్కడ ఎవరమూ లేం… అమృత మాయలన్నీ
పాలిండ్ల మధ్యనే ఖననమయిపోయినప్పుడు

ఊపిరిలోకి విస్తరించిన ఆశయం
మానవత్వం కరవెైన గ్రంథాల గుహల్లో కప్పెట్టబడ్డప్పుడు
ఇప్పుడు వాళ్ళకి చావు పరిమళమే అత్తరు వాసన తల్లీ
దూరంగానో… దగ్గరిగానో… పక్కనుంచో… పెైనుంచో
ఎటునుంచయినా వేటగాడి బాణం నీవెైపుకే… …
చివరాఖరికి ఏమైపోతారు వీళ్ళు బురఖాలోంచి తెల్లని రెప్పల్ని ఎత్తి
ఎరట్రి అగ్నిధారలు కురుస్తున్న కళ్ళతో
ఒక్కసారిగా ఈ ప్రపంచాన్ని మీరంతా చూస్తే
ఏమైపోతారు … ఎక్కడ దాక్కుంటారు వీళ్ళు

అక్షరం నేర్పడం నేరమని ఆజ్ఞాపించిన వాళ్ళకి
అమ్మగా మారినందుకు… కన్నపేగు ఇప్పుడు
ప్రసవ సముద్రపు కన్నీటిలో గాయాల్ని కడుక్కుంటోంది
తల్లీ… మలాలా…
మానవ రక్త గుచ్ఛాల్ని

మీ గర్భాల్లోంచి సునాయాసంగా
బయటకు తీసి లాలించే అమృత రహస్య లిపిని
నిర్భయంగా నేర్చిన జ్ఞాన జాతి మీది
ఇప్పుడు చదవాల్సిందీ… నేర్వాల్సిందీ …
మీరు కాదు… … మేము….!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top