You Are Here: Home » చిన్నారి » కవితలు » అంశుమాలికి అభివందనం

అంశుమాలికి అభివందనం

పలుగు రాళ్లను వజ్ర వైఢూర్యాలుగా తీర్చిదిద్దే
పవిత్ర కార్యం ఉపాధి అయిన
ఉపాధ్యాయా నీకు వందనం
పసి మొగ్గల జీవన చిత్రాల మీద
పసిడి నిగ్గుల్ని బాధ్యతగా అద్దే

అధ్యాపకా నీకు అభివందనం
బాల బాలికల మనో వికాసానికి ఆలంబనైన
భావి భారత సౌభాగ్య ప్రదాతా నీకు ప్రణామం
పలక లేని స్థితిలో
పరవళ్లు తొక్కుతున్న అలలు ఈ బాలలు
కలల సముద్రం మీద

అలవోకగా వాళ్లను ఆవలి తీరాలకు తరలించు
నోటి చెలిమ లోంచి
జాలువారే నీ మాటల సెలయేళ్లు
బుద్ధి వికాసాన్ని కూర్చే
బోధనలై ప్రవహించనీ
నల్ల బల్ల మీది నీ రాతల్లోంచి
జ్ఞాన సూర్యుని కిరణాలు నేరుగా ప్రసరించనీ
కంటి ప్రమిదలో ప్రేమ ఒత్తిని నిలబెట్టి

కారుణ్య దీపాన్ని వెలిగించు
బెత్తాన్ని తుత్తునియలు చేసి
కర్కశత్వాన్ని కాలి కింద నొక్కిపెట్టి
అమాయక బాలల్ని
ఆనంద మార్గాల మీదుగా
అభివృద్ధి గమ్యానికి నడిపించు
చిరు శిక్షలకే పరిమితం చేసిన దండన
ఆత్మవిశ్వాస రాహిత్యాన్ని చేస్తుంది ఖండన

చిన్ని పుష్పాలు
నిండిన తోటకు వనమాలివి
అజ్ఞాన తిమిరాన్ని
తరిమికొట్టే అంశుమాలివి
నీ ప్రజ్ఞ వందనీయం
నీ ప్రయాస అభినందనీయం

(సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం)
ఎలనాగ

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top