You Are Here: Home » చిన్నారి » కథలు » అంబుధి

అంబుధి

ambhudiచైతన్య చేతి వ్రేళ్ళు కంప్యూటర్‌ కి బోర్డు మీద విలాసంగా కదులుతుంటే, మధ్య మధ్య మౌజు సాయంతో స్క్రీన్‌ మీద అక్షరాల్ని చెరిపేస్తూ, సరి చేస్తున్నాడు. ఇంజనీరింగ్‌ చదువుతున్న మనవడిని తదే కంగా చూస్తున్న జానకమ్మకు ఆయనే గుర్తు కొస్తున్నారు. ‘‘ఏమిటి నానమ్మ, అలా ఆశ్చ ర్యంగా చూస్తున్నా వు’’ అంటు విల్‌ చైరులో జానకమ్మ వైపు తిరిగి అడిగాడు. ‘‘ఆ రోజుల్లో మీ తాత గారు ఆఫీసుకు వరుసగా రెండు మూడు రోజులు సెలవులు వస్తే, టైపుమిషన్‌ను ఇంటికి తెచ్చుకుని, టైపు మిషన్‌ మీద వ్రేళ్ళను గమ్మత్తుగా ఆడిస్తుంటే, వారి చేతికున్న ఉంగరాలు తళ తళ మెరిసి పోయేవి, బుల్‌ బుల్‌ సితార వాయించినట్లుగా కమ్మని సంగీతం వినిపిస్తుండేది. అలా ఎంత సేపు అయినా వింటూ కూర్చునేదాన్ని’’. ‘‘ఈనాటి నా కంప్యూటర్‌కు, ఆనాటి టైపు మిషన్‌కు చాలా తేడా ఉంది తెలుసా’’ చేతులు గాలిలో త్రిప్పుతు అన్నాడు.

‘‘నీ కంప్యూటర్‌కు మూలం మీ తాతగారి టైపు మిషన్‌ అనే విషయాన్ని విస్మరించకు చైతన్య’’ గర్వంతో మేళవించిన చిరు కోపంతో అంది. ‘‘ఎప్పుడో శివ సన్నిధి చేరిన, శివరామయ్య తాత గారంటే నీకు ఎంత ప్రేమ, ఆయన మీద ఈగ వాలనివ్వవు కదా… మరి తాత గారికి కూడా నీ మీద అంత మక్కువ ఉండేదా? నానమ్మ’’. ‘‘పిచ్చికన్నా ఇపుడు నీకేం అర్ధం కాదురా. నువ్వు ఒక పిల్ల చేతిలో పడితే, తెలుస్తుంది. విత్తు మొదలా? చెట్టు మొదలా అంటే ఏం సమాధానం చెపుతావు’’ మనవడి బుగ్గలు నిమురుతూ అంది. ‘‘నీ కౌంటర్‌ జవాబుతో నన్ను ఎన్‌కౌంటర్‌ చేశావు కదా నానమ్మ’’ గలగలా నవ్వుతు నానమ్మ భుజాల్ని గారాభంగా వాటేసుకొని, ‘‘వస్తాను నానమ్మ’’ అంటు బయటపడ్డారు.

సోఫాలో ఒదిగి కూర్చున్న జానకమ్మకు శివరామయ్యను గూర్చిన ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆయన సృ్మతి పథంలోని అనుభూతులన్ని మనఃఫలకం మీద జాలు వారసాగాయి. ఆయన అంటే తనకు ఎంతో ప్రేమ, అనురాగాలతో పాటు ఏదో బిడియం, భయం కూడా ఉండేది. అఫీసు నుంచి వచ్చిన ఆయన ‘జానకీ’ అని పిలిచేవారు ‘‘ఏమిటండి అంటూ వచ్చిన నాతో అదిగో సైకిల్‌కు ఉన్న సంచిలో పూలదండ ఉంది, వెళ్ళి తీసుకో’’ అనేవారు.ఆయన చేతితో తెచ్చి ఇస్తే ఎం పోతుందో! అని గొణుక్కునేదాణ్ని. కాని పూలదండను చేతిలోకి తీసుకొనే సరికి ‘‘వారెంత మంచి వారు అని పొంగిపోయేదాన్ని శనివారం వచ్చింది అంటే, సాయంత్రం గుడికి వెళ్దాం రెడిగా ఉండు అనేవారు. అలాగే అదివారం వచ్చింది అంతే ‘‘జానకి మనం ఈ రోజు ఫస్ట్‌ షోకి వెళ్తున్నాం రెడిగా ఉండు అని మాత్రమే చెెప్పేవారు. ఏ సినిమాకి అని నోటి వరకు వచ్చినా, నాకు, వారు వెళ్దామన్న మాటే మంత్రంలా వినిపించేది.

పండుగ రోజుల్లో వంటలు చేస్తున్నప్పుడు నా ప్రక్కనే ఉంటూ ఎంతో సహాయం చేసేవారు. బెండకాయ వేపుడు, గుత్తివంకాయ కూర, రకరకాల స్వీట్స్‌ను తయారు చేసుకొనేవాళ్ళం. అవన్ని కొసరి కొసరి వడ్డిస్తున్నపుడు ‘‘నువ్వు కూడా కూర్చో జానకి’’ ముక్తసరిగా అనేవారు, భోజనాలు చేస్తున్నప్పుడు, నా వైపు చూస్తు చిన్న నవ్వు నవ్వే వారు… ఆయనకు నచ్చిన కూర, స్వీట్‌, నా ప్లేటులో మరి మరి వేసేవారు.. అలా వేస్తుంటే బ్రహ్మనందంగా అనిపించేది, కానీ ‘ఈ కూర బాగుంది జానకి’, అంటారేమోనని అరమోడ్పు కళ్ళతో వారి వైపు ఆశగాచూసే దాన్ని.

నేను ఆశించినట్టుగా వారి నుండి ఒక మెచ్చుకోలు మాట వచ్చేది కాదు, ఎపుడైనా వారి స్నేహితులు ఇంటికి వస్తే ‘‘జానకీ… నాలుగు కాఫీలు పట్టుకురా’’ అంటూ వారితో మాటల్లో పడిపోయేవారు. ఆర్డర్‌ వేసిన ఐదు నిమిషాల్లోనే కాఫీలు వాళ్ళముందు ఉంచేదాణ్ని, కాఫీ చప్పరించిన మిత్రులు బాగుంది చెల్లెమ్మా’’ అంటుంటే, ఈయన మాత్రం కనుబోమలు ఎగరేస్తు నా వైపు చూసేవారు… అదే నాకు అభినందనలా అనిపించేది. ప్రతి విషయంలో అవసర పూర్తి మాట్లాడే వారు, నాకు మాత్రం ఆయనతో ఎప్పుడు, ఏదో, మాట్లాడలని మనసు తపించిపోయేది… అన్ని అడిగినట్లుగా తెచ్చి ఇచ్చే ఆయనతో ఎం మాట్లాడను??

‘‘ఏదో ఆలోచిస్తున్నావు దేని గురించి అమ్మా’’ కొడుకు అమరేంద్ర పలకరింపుతో ఉలిక్కి పడ్డ జానకమ్మ ‘‘చైతన్య కంప్యూటర్‌ చేస్తుంటే చూస్తూ కూర్చున్నాను బాబు’’ ‘‘అమ్మా! నవంబర్‌ వచ్చేసింది లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది… నీ ఫోటో అతికించి సంతకం చేశాను, నువ్వు కూడా ఇదిగో ఇక్కడ సంతకం చేసి ట్రెజరీ ఆఫీసర్‌కు ఇచ్చిరా’’ అన్నాడు. ‘‘అలాగే బాబు రేపు ఉదయం, చైతన్యతో వెళ్ళి ఇచ్చివస్తాను’’ అంటూ సోఫాలో నుంచి లేచిన జానకమ్మ సర్టిఫికెట్‌ కాగితాన్ని భద్రంగా దాచుకొంది.
చైతన్యతో పాటు ‘‘సబ్‌ ట్రెజరీ ఆఫీసు’’లో అడుగిడిన జానకమ్మను గుర్తించిన అటెండర్‌ సాంబయ్య పరుగు పరుగున ఎదురువచ్చి ‘‘రండి అమ్మగోరు… యస్‌.టి.ఓ., గారు ఉన్నారు’’ అంటూ రూంలోకి తీసుకువెళ్ళాడు. ‘‘సార్‌, ఈ అమ్మగారు మన అఫీసులో టైపిస్టుగా పని చేసి రిటైర్‌ అయిన శివరామయ్య గారి భార్య అండి, లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి వెళ్దామని వచ్చారు’’ అంటూ కొత్తగా వచ్చిన యస్‌.టి.ఓ. గారికి పరిచయం చేశాడు.

‘‘నమస్కారమమ్మ… రండి… ఇలా కూర్చోండి’’ అంటూ జానకమ్మను అహ్వానిస్తు కుర్చీ చూపించాడు. సర్టిఫికేట్‌ కాగితాన్ని అందిస్తున్న జానకమ్మ చూపు. ఆఫీసర్‌ వెనకాల బీరువాపై పడి ఉన్న టైపు మిషన్‌పై ఉంది. దాన్ని అలాగే చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయింది. ‘‘అమ్మ గారు, ఆ టైపు మిషన్‌ శివరామయ్య అయ్యాగారు, పదవి విరమణ పొందిన రోజునాడే, అలా బీరువా మీదికి ఎక్కించాండ. ఇపుడు దాన్ని ఎవరూ వాడడం లేదు. ఆఫీసుకు అన్నీ కంప్యూటర్స్‌ వచ్చాయి’’ అంటు సాంబయ్య యధాలాపంగా చెప్పుకుపోతున్నాడు. మౌనంగా వింటున్న జానకమ్మ కొద్దిగా ఆఫీసర్‌ ముందుకు జరిగి ‘‘బాబు, ఆ టైపు మిషన్‌ను… ఒకసారి తడిమి చూసుకోవచ్చా?’’ తడబడుతూ అడిగింది. ఆవిడకు మిషన్‌ పట్ల ఉన్న అభిమానానికి ముగ్దుడైన అఫీసర్‌గారు ‘‘అలాగే చూడండి అమ్మా! మీకు ఆ టైపు మిషన్‌ కావాలనుకుంటే… ఈ హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ క్రింద రూ 1500/- జమ చేస్తే అన్‌ సర్వీసబుల్‌ మిషన్‌గా వ్రాసుకొంటాము. అప్పుడు దాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు’’ అంటు సలహా ఇచ్చాడు.
ఆఫీసర్‌ గారి మాటలకు జానకమ్మలో ఎంతో ఆనందాన్ని కలిగించాయి…

‘‘రేపు చలానా కట్టమని నా కొడుకును పంపిస్తాను. ఆ టైపు మిషన్‌ కావాలి బాబు’’ అంటూ నమస్కరిస్తూ బయటకు వచ్చింది. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన ఆమరేంద్రతో ‘‘నువ్వు చెప్పినట్టుగానే యస్‌.టి.ఓ. ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికేట్‌ ఇచ్చి వచ్చా బాబు’’ అంటున్న తల్లివైపు మరింకేం? అన్నట్టుగా చూశాడు… మెల్లగా చెప్పడం ప్రారంభించింది… ‘‘మీ నాన్నగారు ఉపయోగించిన టైపు మిషన్‌, ఆ ఆఫీసులో, దుమ్ము, ధూళి సోకి బీరువాపైన పడి ఉండడం, నాకు బాధగా ఉంది బాబు, వారి చేతి వ్రేళ్ళతో పునీతమైన ఆ టైపు మిషన్‌ నాకు కావాలి బాబు’’ అంటూ కొడుకు సమాధానం కోసం ఎదురు చూడకుండానే జానకమ్మ చలాన ఫాం అందించింది.

‘‘నువ్వు కావాలనుకుంటే, తప్పకుండా తీసుకుందాము అమ్మా! రేపు ఉదయమే వెళ్ళి టైపు మిషన్‌ మన ఇంటికి తీసుకువస్తాను’’ తల్లి చేతిలోని చలానాను జేబులో పెట్టుకొన్నాడు. నచ్చిన బొమ్మను మారాం చేసి పెద్దవాళ్ళతో కొనిపించినపుడు? పిల్లలు పొందే ఆనందంలా ఉంది జానకమ్మ మనసు.
తెల్లవారి సాయంత్రం అమరేంద్ర కార్లో నుండి టైప్‌ మిషన్‌ను తీసుకొని వచ్చి మధ్యహాల్‌లోని టేబుల్‌ మీద పెట్టాడు. ‘‘అమ్మా! అమ్మా! నువ్వు కోరుకొన్నట్టుగా నాన్నగారి టైపు మిషన్‌ తెచ్చానమ్మ చూడు’’ సంతోషంగా పిలిచాడు. ఇంట్లో నుండి పరుగెత్తుకొంటూ వచ్చిన జానకమ్మ పరవశించి పోతు టైపు మిషన్‌ను ఎంతో ప్రేమగా, అప్యాయంగా తడిమి తడిమి చూసుకోసాగింది. తల్లి సంతోషానికి అమరేంద్ర తన్మయం చెందుతూ టైపు మిషన్‌ మీద కప్పిన కవర్‌ తొలగించాడు.

టైపు మిషన్‌ రూలర్‌ మధ్య ఒక లేటర్‌ టైపు చేయబడి ఉంది, ఆత్రుతగా రూలర్‌ను పైకి తిప్పుతుంటే లేటర్‌లో ఉన్న ఒకొక్క అక్షరాన్ని అమరేంద్ర గబగబా చుదువుతూ చలించిపోయాడు… తల్లివైపు విస్మయంగా చూస్తున్న అమరేంద్రలో ‘‘ఏమిటి బాబు’’ అంటూ ఆసక్తిగా అడిగింది.
‘‘అమ్మా! నాన్నగారు రిటైర్‌ అయిన రోజున, టైపు చేసిన ఆఖరి లెటరు అమ్మా, కానీ ఇది ఆఫీసుకు సంబంధించిన లెటర్‌ కాదు’’ జానకమ్మ మరింత తొందరపడిపోతూ… ‘‘మరి అది ఏమి లెటర్‌ బాబు…’’ ‘‘నాన్నగారు తెలుగులో టైపు చేశారమ్మ! చదువుతాను విను’’ అంటూ రూలర్‌ను మెల్లిగా పైకి త్రిప్పుతు ఒక్కొక్క వాక్యాన్ని ఇలా చదవసాగాడు…

‘‘నేను నా జీవితంలో పైకి రావడానికి కారణం నా భార్య! ఆమె నా జీవం, నా ప్రాణంలో ప్రాణం. ఈ విషయన్ని ఎన్నోమార్లు చెప్పాలని ప్రయత్నించాను… నువ్వు చాలా అందంగా ఉన్నావని నేను అంటే ఏమిటా మాటలు… పెద్ద చెప్పొచ్చావు అంటు తిరస్కరిస్తుందెమో? ఆఫీసులో ఇంక్రిమెంట్‌ వచ్చిందని కొత్త చీర తీసుకు వచ్చి కట్టుకో జానకి చాలా బాగుంటుందని అంటే… ఏమిటా చిలిపి మాటలు ప్రక్క గదిలో కోడలు ఉందని మరిచిపోయారా? అంటుందేమో? నీ చేత చేసిన కూరలు, స్వీట్స్‌ భలే రుచిగా ఉన్నాయని మెచ్చుకోలు చెపితే నాకు మీ ముఖస్తుతులు ఏం వద్దులెండి అంటూ చిరుకోపం ప్రదర్శిస్తుందేమో? నాలో నేను మదనప డిపోయిన రోజుల గురించి, ఏం చెెప్పేది??

…ఒక్కటి నిజం, నాకు పూర్ణత్వం ఇచ్చిన మనిషి ఆవిడే! నాలో ఆమె అంతర్యామియై లాలించింది, పాలించింది. ముందుకు నడిపించింది… నేనని ఏమున్నాను నేనంతా నువ్వే… అంబుధి మహాంబుధిలో కలిసినట్టుగా… అంతే కదూ జానకీ!!’’ ఊపిరి బిగబట్టి వింటున్న జానకమ్మ మనసు ఆర్ధ్రతలో నిండిపోయి, కళ్ళు చెమ్మగిల్లాయి.

– రావుల పుల్లాచారి,
సెల్‌: 9949208476

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top