You Are Here: Home » సినిమా » పాటలు » అందాల రాముడు (1973)- ఎదగడానికెందుకురా తొందరా

అందాల రాముడు (1973)- ఎదగడానికెందుకురా తొందరా

సాకీ :
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా…
ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ..
జోజో జోజో… జోజో జోజో…
పల్లవి :
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర ॥
జోజో జోజో… జోజో జోజో…

చరణం : 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి
కాలేజీ సీట్లు అగచాట్లురా
అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా
అందుకే… ॥

చరణం : 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి
అడ్డమైనవాళ్లకీ గుడ్‌మార్నింగ్ కొట్టాలి
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్‌వ్యూ అంటూ క్యూ అంటూ
పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా
మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావి నీకెపుడూ దోస్తురా
అందుకే… ॥

చరణం : 3
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే
ఎంఏలు అచట ముందు సిద్ధము
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో
పదినెల్లదాకా జీతమివ్వరు
నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘంలో ఎదగడమే దండగా
మంచి కాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగా
అందాకా… ॥
జోజో జోజో… జోజో జోజో…
టాటా టాటా… టాటా టాటా…

చిత్రం : అందాల రాముడు (1973)
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : వి.రామకృష్ణ

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top