అందగత్తె ఎవరు?
రామాపురం అనే ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురూ చాలా అందమైన వాళ్లు. ఒకరోజు ఆ ముగ్గురు అక్కాచెళ్ళెళ్లు సరదాగా నది ఒడ్డున ఉన్న ఉద్యానవనానికి వెళ్ళారు. ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. వారి సంభాషణ ‘తమ ముగ్గురిలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు’ అనే విషయం మీదకు మళ్ళింది. ఎవరికి వారు ‘నేను అందగత్తెన ంటే కాదు నేనే అందగత్తెను’ అనుకోసాగారు.
ఆకాశమార్గాన వెళుతున్న దేవకన్య ఇదంతా విన్నది. ఆమె ఒక బీద స్త్రీలా మారువేషం ధరించి ఆ అక్కాచెల్లెళ్ల ముందుకు వచ్చింది.
‘‘అమ్మలారా! పిడికెడు అన్నం తిని మూడు రోజులైంది. నామీద దయతలచి ఏమైనా దానం చేయండి’’ అని వారిని వేడుకుంది.
‘‘ఛీ…ఛీ..! ప్రశాంతంగా ఉందామని ఉద్యానవనానికి వస్తే, ఇక్కడ కూడా ఇదేం గోల?’’ అంటూ ముగ్గురిలో పెద్దదైన రమణి విసుక్కుంది.
‘‘అయినా దానం చేయడానికి ఇక్కడేం ఉంది. ఇంటి దగ్గర నుండి మేము ఏమీ పట్టుకు రాలేదు. పో అవతలకి’’ అని గద్దించింది రెండోదైన శోభ.
‘‘అలా అనకండమ్మా, చాలా జ్వరంగా కూడా ఉంది. చచ్చి మీ కడుపున పుడతాను. కాస్త దయచూపండి’’ అందామె గడగడా వణికిపోతూ.
ఆమెకు నిజంగానే జ్వరం ఉన్నట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిలబడలేక నీరసంతో తూలిపోతోంది. ఆ అక్కచెళ్ళెళ్లలో చిన్న దైన సుకన్య వెంటనే తను కప్పుకుని ఉన్న వస్త్రాన్ని తీసి ఆ బీదరాలి భుజం మీద వేసింది.
‘‘తినడానికి మా దగ్గరేం లేదమ్మా. మాతో ఇంటికి వస్తే అన్నం పెడతాను. లేదా ఇదుగో ఇది తీసుకుని ఎక్కడైనా అమ్మి వచ్చిన డబ్బును నీ వైద్యానికి, ఆహారానికి ఉపయోగించు’’ అంటూ సుకన్య తన చెవి కమ్మలు తీసి ఆమె చేతిలో పెట్టింది.
వెంటనే ఆ బీదరాలు దేవకన్యగా మారిపోయింది. ఆ దేవకన్య ఇలా చెప్పింది. ‘‘నేను గంధర్వ రాజు కుమార్తెను. ఆకాశమార్గంలో వెళుతూ మీ సంభాషణ విన్నాను. మీలో ఎవరు నిజంగా అందమైన వారో తెలుసుకోవడానికి మారు వేషంలో వచ్చాను. అందమంటే కేవలం బాహ్యరూపానికి సంబంధించినది మాత్రమే కాదు. అందమైన మనసున్న వారే నిజమైన అందగత్తెలు. మీలో సుకన్య చాలా అందమైనది’’ అన్నది. దేవకన్య మాటలు విని రమణి, శోభలు సిగ్గుతో తల వంచుకున్నారు.