You Are Here: Home » చిన్నారి » అందం కన్నా నైపుణ్యం మిన్న

అందం కన్నా నైపుణ్యం మిన్న

ఒకరోజు వికారరూపుడైన ఒక యువకుడు విష్ణుశర్మ ఆశ్రమానికి వచ్చి ఆయనను కలిసాడు. ‘‘స్వామీ, ఈ కురూపితన్నాని భరించలేక పోతున్నాను. నన్ను అందంగా మార్చండి. లేకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు.
‘‘తప్పకుండా మారుస్తాను. అయితే నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండాలి. నువ్వు మీ ఊళ్ళో ఏ పని చేసేవాడివి’’ అని అడిగాడు విష్ణుశర్మ.

‘‘నేను చదువుకోలేదు. అయితే చెక్కతో బొమ్మలు చేయడం మా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాను’’
విష్ణుశర్మ అతను బొమ్మలు చేయడానికి అవసరమైన వస్తువులన్నీ తెప్పించాడు. దేవుడు అందమైన రూపం అతనికి ఇవ్వలేదుగానీ గొప్ప నైపుణ్యాన్ని అతని చేతి వేళ్ళకు ఇచ్చాడు. ఏ చిన్న కర్రముక్కనైనా అద్భుతమైన బొమ్మగా మలిచేవాడు. అతను బొమ్మలు చేయడం, విద్యార్థులు ఊళ్ళోకి తీసుకెళ్ళి అమ్మడం చేసేవారు. ఆ కుటీరానికి వచ్చేవారు కాస్సేపు అతని దగ్గర నిలబడి అతని పనితనాన్ని అపురూపంగా, ఆశ్చర్యంగా చూసేవారు.

రాను రాను అతని బొమ్మలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. చివరకు ఆ బొమ్మలు రాజుగారి కొలువుకు కూడా చేరాయి. రాజు తను కొత్తగా నిర్మిస్తున్న భవంతికి ఆ శిల్పి కావాలని కబురు పంపాడు.

‘‘చూశావా కార్తికేయా, బాహ్యరూపం అంత ప్రధానమైనది కాదు. వ్యక్తులు రూపంతో కాకుండా గుణంతోనే గుర్తింపబడతారు. మనిషి రాణించేది, చివరి దాకా మిగిలేది అతనిలోని నైపుణ్యతే. అందుకే కొకిల గానానికి మైమరచే లోకం దాని నలుపును ఈసడించుకోదు. వెళ్లిరా కార్తికేయా!’’ అని చెప్పాడు విష్ణుశర్మ. కన్నీళ్లతో గురువుగారి పాదాలను అభిషేకించాడు కార్తికేయుడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top